తెలుగు రాష్ట్రాలకు రు.500 నోట్లు

చిల్లర సమస్యతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజల కష్టాలు కొద్దిగా తీరనున్నాయి. బ్యాంకులు, ఏటీఎం లలో అన్నీ రెండు వేల రూపాయల నోట్లు ఉండడంతో చిల్లర దొరక్క అల్లాడుతున్న తెలుగు ప్రజల కష్టాలు కొంత వరకు తీరే అవకాశం కలుగుతోంది. ఇప్పటి వరకు చాలా కొద్ది మొత్తంలో తప్ప ఎక్కడా కొత్త ఐదు వందల రూపాయల నోట్లను ఎరుగని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు ఐదు వందల రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంకు పంపుతోంది. తెంగాణకు 500 కోట్ల విలువైన ఐదువందల నోట్లను, అదే మొత్తంలో ఆంధ్రప్రదేశ్ కు ఐదు వందల నోట్లను రిజర్వ్ బ్యాంకు పంపినట్టు సమాచారం. దీనితో చిల్లర సమస్యతో అల్లాడుతున్న ప్రజలకు కొంత మేరకు వెసులుబాటు కలుగుతుంది.

బ్యాంకుల్లో నగదు విత్ డ్రా చేసుకున్నా, ఇటు ఎంటీఎంలలో డబ్బులు తీసుకున్నా అన్నీ రెండు వేల రూపాయల నోట్లు వస్తుండడంతో సాధారణ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. చిల్లర దొరక్క విలవిల్లాడుతున్నారు.  ఈ క్రమంలో కొత్త ఐదువందల నోట్లు మార్కెట్ లోకి రావడం వల్ల చిల్లర సమస్య తీరుతుందని భావిస్తున్నారు.