తవ్విన కొద్ది నోట్ల కట్టలు

సంచనలం సృష్టిస్తున్న టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి నల్లధనం వ్యవహారంలో తవ్విన కొద్ది  అక్రమ సొమ్ము బయట పడుతూనే ఉంది. కోట్లాది రూపాయల నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. కోట్లాది రూపాయల డబ్బుతో పాటుగా వందల కిలోల బంగారం కూడా బయట పడింది. ఇప్పటివరకు 107 కోట్ల రూపాయల నగదుతో పాటుగా 127 కిలోల బంగారాన్ని ఆదాయపుపున్న శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా శేఖర్ రెడ్డికి చెందిన కారులో 24కోట్ల రూపాయలు బయటపడ్డాయి. ఇవన్నీ కూడా కొత్త రెండు వేల రూపాయల నోట్లు కావడం విశేషం. ఇంత పెద్ద మొత్తంలో కొత్త నోట్లు బయట పడుతుండడంతో అటు ఐటి అధికారులు కూడా అవాక్కవుతున్నారు.

కాట్పాడిలోని ఆయన నివాసంలో కూడా అధికారులు సోదాలు చేసేందుకు వీలుగా ఇంటిని సీలు చేశారు. శేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరూ లేని కారణంగా వారి సమక్షంలో తనిఖీలు చేయడానికి వీలుగా ఇంటికి సీలు వేశారు. ఇక్కడ కూడా భారీ మొత్తంలో నగదు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అతి కొద్ది సమయంలో కోట్లాది రూపాయలను కూడగట్టుకున్న శేఖర్ రెడ్డి చాలా మంది పెద్దలకు బినామీగా ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

మరో వైపు ఇంత పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు బయటపడడం అవి కూడా కొత్త రెండు వేల రూపాయల నోట్లు కావడం సంచలనం కలిగిస్తోంది. రెండు వేల రూపాయల కోసం సామాన్యులు గంటల తరబడి రోడ్లపైనే గడుపుతున్నా శేఖర్ రెడ్డి లాంటి వాళ్ల వద్ద కోట్లాది రూపాయలు లభ్యం కావడం విస్మయం కలిగిస్తోంది.