తవ్వినకొద్దీ నోట్ల కట్టలు, బంగారం

పాత సినిమాల్లోని పూరాతన నిధిని హీరో చూసిన సందర్భాల్లో ఎక్కడ చూసినా బంగారు నాణాలు, ఆభరాణల గుట్టలే కనిపిస్తాయి. ఇక్కడా అక్కడా అని తేడా లేకుండా రహస్య స్థావంరం అంతా బంగారు మయంగా ఉంటుంది. ప్రసుత్తం చెన్నైకు చెందిన వ్యాపారి, టిటిడి బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్న అధికారులకు కూడా ఆయన ఇంట్లో ఎక్కడ చూసినా బంగారం, నోట్ల కట్టలే కనిపిస్తున్నాయి. తవ్విన కొద్దీ బయటపడుతున్న నల్ల సొమ్మను చూస్తున్న ఆదాయపుపన్ను శాఖ అధికారుల కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.

శేఖర్ రెడ్డి ఇల్లు నిజంగా లక్ష్మీ నివాసమే, ఆయన కారులో 24కోట్ల లభించగా ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలు, బంగారపు ముద్దలే. రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్న అధికారులకు 131కోట్ల నగదు, 170 కిలోల బంగారం లభించగా తాజాగా నిర్వహించిన సోదాల్లో పెద్ద మొత్తంలో లగదు లభించింది. వందల కోట్ల రూపాయల నగదు ఐటి అధికారలకు లభించిందని అనధికార సమాచారం. అధికారికంగా ఎంత మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారనే సంగతి ఆదాయపుపన్ను శాఖ అధికారులు వెల్లడించలేదు.

శేఖర్ రెడ్డికి చెందిన ఇంట్లో ప్రతీ చోటా నగదు, బంగారం ఉన్నట్టు తెలుస్తోంది. ఒక గోడ నిర్మాణం పగులగొట్టి చూడగా గోడలో దాటిన బంగారపు కడ్డీలు బయటపడ్డాయి. నగదు బంగారంతో పాటుగా పెద్ద మొత్తంలో ఆస్తులకు సంబంధించిన పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నోట్ల రద్దు తరావత ఇంత కొద్ది సమయంలో కొత్త నోట్లను ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా కూడగట్టారు దీనికి ఎవరు సహకరించారు అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.