డబ్బులేక ప్రజల్లో పెరుగుతున్న అసహనం

పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలతో దేశవ్యాప్తంగా ప్రజల్లో అసహనం పెరుగుతోంది. పెద్ద  నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తరువాత దేశవ్యాప్తంగా పరిస్థితి దారుణంగా తయారయింది. చేతిలో చిల్లి గవ్వలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి బ్యాంకుల క్యూలలో నిల్చుకున్నా కనీస అవసరాలకు కూడా డబ్బులు అందడంలేదు. ఇక ఏటీఎంల పరిస్థితి సరేసరి ఇప్పటికీ దాదాపు 80శాతానికి పైగా ఏటీఎంలు అసలు పని చేయడమే లేదు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాదాపుగా నెలరోజులు గడుస్తున్నా నగదు కొరత తీరడం లేదు. చేతిలో డబ్బులు లేక సామాన్యుడు అల్లాడుతున్నారు. కనీస అవసరాలకు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు చిన్నర వ్యాపారులు పడుతున్న బాధలు వర్ణణాతీతం. బేరాలు లేక దుకాణాలు మూసుకునే పరిస్థితిలు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు జరపాలంటూ ప్రభుత్వ పెద్దలు ఇస్తున్న సలహాలు ఆచరణ సాధ్యం కావడం లేదు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వ్యావసాయం కుంటుపడింది. చేతికి అందిన పంటలు అమ్ముకోలేక రైతులు అగచాట్లు పడుతున్నారు, వ్యాపారాలు లేక వ్యాపారులు అల్లాడుతున్నారు. చేతిలో డబ్బులు లేక సామాన్యులు విలవిల లాడుతున్నారు. గంటల తరబడి బ్యాంకుల క్యూలలో నిల్చున్నా చేతికి డబ్బులు మాత్రం అందడం లేదు. అత్యవసర అవసరాలుకు కూడా నగదు లేక ప్రజలు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు.

పెళ్లిళ్లు వాయిదా వేసుకున్న వారు కొందరైతే, నామ మాత్రంగా పెళ్లి అయింది అంటే అయింది అని అనిపించుకున్న వారు మరికొందరు. అత్యవసరం అయితే తప్ప అస్పత్రులకు కూడా వెళ్లడం లేదు. ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్సలకు కూడా నగదు లేక విలవిల్లాడుతున్నారు. ఎక్కడా రూపాయి అప్పు పుట్టడం లేదని ప్రజలు వాపోతున్నారు.

ఒక వైపు సామాన్యుడు నగదు కోసం అల్లాడుతుంటే పెద్ద మనుషులు మాత్రం దొంగ దారిని కోట్లాది రూపాయలను పోగేసుకుంటున్నారు. బ్యాంకుల నుండి, పోస్టాఫీసుల నుండి సామాన్యులకు అందాల్సిన డబ్బు కొంత మంది పెద్ద వ్యక్తుల జేబుల్లోకి పోతోంది. కోట్లాది రూపాయల ధనం వీరి వద్దకు ఎట్లా వస్తోంది అనే విషయాన్ని ప్రభుత్వ అధికారులు పసిగట్టలేకపోతున్నారు. కంచే చేను మేసిన చందంగా బ్యాంకుల నుండి దారి మళ్లుతున్న సొమ్ము పెద్దల వద్దకు చేరుతోంది. దీనితో సామాన్యుడు మరింత కష్టాలను అనుభవిస్తున్నాడు.