టీటీడీ బోర్డు సభ్యుడి వద్ద 70కోట్ల కొత్తనోట్లు

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి నివాసంలో ఐటి అధికారులు చేసిన దాడుల్లో విస్తుగొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. ఆయన నివాసంలో ఐటి అధికారులకు దాదాపు 90కోట్ల రూపాయల నగదు లభ్యం కాగా అందులో 70కోట్ల మేర కొత్త రెండు వేల రూపాయల నోట్లు లభించడం విశేషం. ఇంత పెద్ద మొత్తంలో లెక్కలు చూపని కొత్త నోట్లు లభ్యం కావడం దేశంలోనే ఇదే అధికమని భావిస్తున్నారు. చెన్నైలో పేరుమోసిన తెలుగు వ్యాపారి శేఖర్ రెడ్డి నివాసంతో పాటుగా ఆయన సన్నిహితులు శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ రెడ్డిల నివాసాలపై కూడా ఐటి అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 90కోట్ల రూపాయల మేరకు నగదుతో పాటుగా 100 కిలోలో బంగారం లభించింది. ఇంత పెద్ద మొత్తంలో నగదు బంగారం లభించడంతో ఐటి అధికారులే ఖంగుతిన్నారు. వీరి ముగ్గురిని ఐటి అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 130 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తేల్చారు. చైన్నైలో ప్రముఖ వ్యాపారుల్లో ఒకరైన శేఖర్ రెడ్డి అధికార అన్నా డీఎంకే పార్టీకి సన్నిహితంగా ఉంటున్నారు. శేఖర్ రెడ్డి తమిళనాడులో వెయ్యికోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టు పనులను నిర్వహిస్తున్నారు. శేఖర్ రెడ్డి వద్దకు 70కోట్ల కొత్త నోట్లు రావడం పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు అతని వద్దకు ఎట్లా వచ్చింది దీనికి ఎవరు సహకరించారు అనే దానిపై విచారణ జరుపుతున్నారు.