హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద జేఏసీ తలపెట్టిన మహాధర్నాకు అనుమతి లభించలేదు. 2013 భూసేకరణ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ జేఏసీ తలపెట్టిన మహాధర్నాకు అనుమతి ఇవ్వడం కుదరదని పోలీసులు స్పష్టం చేశారు. తాము చేపట్టిన మహా ధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం తెలంగాణ డీజీపీ ని కలిశారు. అనుమతి ఇవ్వడం కుదరదని డీజీపీ కోదండరాం కు స్పష్టం చేశారు. తమ ధర్నాకు పోలీసుల అనుమతి లెకున్నా తాము తమకు తెలిసిన విధానంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని కోదండరాం చెప్పారు. పోలీసులు తమ ధర్నా కార్యక్రమానికి అనుమతి మంజూరు చేయకపోవడం దారుణమని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకుని వచ్చిన చట్టం వల్ల ప్రజల భుములు ప్రభుత్వం లాక్కునేందుకు వీలు కలుగుతుందని అన్నారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజల భూములను బలవంతంగా లాక్కోవడం పై కోదండరాం అభ్యంతరం వ్యక్తం చేశారు. పేద ప్రజల భూములను బలవంతంగా లాక్కునే హక్కు ఎవరికీ లేదన్నారు.
ప్రభుత్వ చర్యల వల్ల వేలాది మంది ప్రజలు నిర్వాసితులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బలవంతంగా భూములు లాక్కోవడం వల్ల అన్నీ కోల్పోయి రైతులు రోడ్డున పడుతున్నారని చెప్పారు.