జర్మనీలో దాడి మాపనే:ఐఎస్ఐఎస్

జర్మనీ రాజధాని బెర్లిన్ లోని క్రిస్మస్ మార్కెట్లో జరిగిన ఉగ్రవాద దాడి తమ పనేనని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ప్రకటించింది. తమను తుదముట్టించడానికి ప్రయత్నిస్తున్న అన్ని దేశాల్లోనూ ఇదే తరహాలో దాడులు చేస్తామని హెచ్చరించిన ఐఎస్ఐఎస్ ప్రకటనను ఒక వార్త సంస్థ విడుదల చేసింది. రద్దీతో కిటకిట లాడుతున్న బెర్లిన్ లోని క్రిస్మస్ మార్కెట్ లోకి వేగంగా వచ్చిన ట్రక్కు పాదచారులపైకి దూసుకుని పోయిన ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా గాయపడ్డారు. పోలాండ్ కు చెందిన ట్రక్కును నడిపిన పాకిస్థాన్ కు చెందిన 23 సంవత్సరాల యువకుడిని జర్మనీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తొలుత దీన్ని ప్రమాదంగానే భావించినప్పటికీ ట్రాక్కును కావాలనే జనాలపై నుండి తీసుకుని వెళ్లారని అధికారులు నిర్థారించారు. ప్రమాదానికి కారణం అయిన ట్రక్కులో ఒక మృత దేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ట్రక్కు డ్రైవర్ ను కాల్చి చంపి ఆ తరువాత ట్రక్కును అపహరించి రద్దీగా ఉన్న మార్కెట్ లోకి దూసుకుని పోయినట్టు పోలీసులు భావిస్తున్నారు.

ఐఎస్ఐఎస్ ను అంతం చేయడం కోసం సిరియా, ఇరాక్ లలో జరుగుతున్న పోరులో జర్మన్ దళాలు పాల్గొంటున్నాయి. జర్మనీ అమెరికాతో కలిసి ఈ పోరులో పాల్గొంటోంది. ఈ క్రమంలోనే జర్మనీపై దాడి జరిగినట్టు భావిస్తున్నారు.