జయ లలితను హత్యచేశారు:అమృత

ఒక పథకం ప్రకారం తమ పెద్దమ్మ, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను హత్య చేశారని జయలలిత చెల్లెలు కూతురు అమృత తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. జయలలిత మరణంపై తమకు అనేక సందేహాలు ఉన్నాయని దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. తమ కుటుంబ సంప్రదాయాల ప్రకారం జయలలిత కు ఉత్తరక్రియలు నిర్వహించిన అనంతరం కర్ణాటకలోని శ్రీరంగంలో ఆమె మాట్లాడారు. జయలలితది సహజ మరణం కాదని ఒక పథకం ప్రకారం అమెను హత్యచేశారడానికి అనవాళ్లు కనిపిస్తున్నాయని అమృత అన్నారు. జయలలిత ఆసుపత్రిలో ఉన్నకాలంలో తమని కనీసం చూడడానికి కూడా అనుమతి ఇవ్వలేదని తమకే కాదు అసలు ఎవరినీ ఆసుపత్రిలో ఉన్న జయలలితను చూడడానికి అనుమతించకపోవడం పై తమకు అనుమానాలు ఉన్నాయని అమృత చెప్పారు.

జయలలిత చుట్టూతా చేరిన కొంత మంది అమెను నిస్సహయరాలుని చేశారని ఆరోపించారు. నిజం తెలుసుకుని తన చుట్టూ ఉన్న వారిని జయలలిత దూరం చేసే ప్రయత్నం చేయడంతో ఆమె ప్రాణాలకే ఎసరు పెట్టారని అన్నారు. జయలలిత అంత్యక్రియలు కూడా కుటుంబ సంప్రదాయాలు పాటించకుండా చేశారని జయలలిత ఆత్మశాంతి కోసం ఉత్తర క్రియలను తమ కుటుంబ పద్దతిలో నిర్వహించామని చెప్పారు. జయలలిత ఆస్తులు, అధికారం కోసం ఆమెను హత్యచేసి ఉంటారని దీనిపై విచారణ జరిపితే వాస్తవాలు బయటికి వస్తాయని ఆమె చెప్పారు.