జయ మరణంపై గౌతమి సంచలన వ్యాఖ్యలు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంపై అనుమానాలున్నాయంటూ ప్రముఖ సినీ నటి గౌతమి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె కోరారు. ఈ మేరకు గౌతమి ప్రధాని నరేంద్ర మోడికి ఒక లేఖ రాశారు. జయలలిత ఆసుపత్రి పాలు దగ్గర నుండి ఆమె మరణం వరకు అన్ని విషయాలను గోప్యంగా ఉంచారని అటు బంధువులను కానీ ఇటు వీవీఐపీలను కానీ జయలలితను పరామర్శించేందుకు అనుమతి ఇవ్వలేదని ఈ పరిస్థితుల్లో అసలు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని గౌతమి అభిప్రాయపడ్డారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని ఆమె అన్నారు.
    చాలా మందికి జయలలిత మరణం పట్ల అనుమానాలు ఉన్నప్పటికీ ఎవరూ ఈ విషయాన్ని లేవనెత్తడానికి బయటకు రాలేదని అయితే తాను మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చానని అన్నారు. తన ఆవేదనను ప్రధాన మంత్రి అర్థం చేసుకుంటారనే భావిస్తున్నట్టు ఆమె చెప్పారు.
     తమిళనాడు ప్రభుత్వాధినేత్రి జయలలిత  ఆరోగ్యం విషయంలో ఇంత రహస్యం ఎందుకు పాటించాల్సి వచ్చిందని గౌతమి ప్రశ్నించారు. ఆమె వద్దకు వెళ్లకుండా నియంత్రించిన వాళ్లు ఎవరు, వాళ్లకున్న అధికారం ఏంటన్నారు. ఆమె ఆరోగ్యం చాలా పాడైనప్పుడు ఆమెకు అందించాల్సిన చికిత్సల గురించి నిర్ణయాలు తీసుకున్నవాళ్లు ఎవరని అడిగారు. ప్రజల మదిలో అలజడి రేపుతున్న ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరిస్తారని నిలదీశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుల గురించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కు పౌరులకు ఉంటుందని గౌతమి తెలిపారు.
    సత్వరం ప్రదాని ఈ విషయంలో స్పందించాలని గౌతమి కోరార. ఆలస్యం చేస్తే నిజాలు పూర్తిగా సమాధి అయ్యే అవకాశం ఉందని గౌతమి అభిప్రాయపడ్డారు.