చుర్రమంటున్న ఎండ-వణికిస్తున్న చలి

హైదరాబాద్ లో వాతావరణంలో వస్తున్న మార్పులతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట వాతావరణం పొడిగా ఉంటూ ఎండ చుర్రుమంటోంది. పగట ిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దాదాపు మూడు నుండి నాలుగు డిగ్రీలు ఎక్కువ నమోదవుతున్నాయి. పగటి పూట 32 నుండి 33 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీని వల్ల మధ్యాహ్నం సమయాల్లో ఎండ మండుతోంది. మరో వైపు రాత్రి పూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోతున్నాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు 12 నుండి 13 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుండి మూడు డిగ్రీల తక్కువ.

పగటి పూట ఎండగా రాత్రి పూట మరీ చల్లగా వాతావరణం మారిపోవడం వల్ల నగర వాసులు చిన్న చిన్న సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ శాతం మంది జలుబు,దగ్గు, జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతల్లోని భారీ మార్పులే ఈ పరిస్థితికి కారణంగా డాక్టర్లు చెప్తున్నారు. ఉత్తర భారత దేశం నుండి వీస్తున్న శీతల గాలుల వల్ల రాత్రి పూట చలి తీవ్రత ఎక్కువగా ఉంటోందని వాతావరణ శాఖ చెప్పింది. ఇట్లాంటి వాతావరణం మరో వారం రోజుల పాటు ఉండవచ్చని వారు వెల్లడించారు. రాత్రి పూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.