గ్యాంగ్ రేప్ అంటూ యువతి నాటకం…

తనను గుర్తుతెలియని వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారంటూ ఒక యువతి ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు పోలీసులను ముప్పతిప్పలు పెట్టింది. తుపాకులతో బెదిరించిన నలుగురు వ్యక్తులు తనను బలవంతంగా కార్ లో ఎక్కించుకుని గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారని ఢిల్లీలోని సఫ్థర్ జంగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహామాయ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని అక్కడి ఫ్లై ఓవర్ పై నుండి తనను దుండగులు తీసుకుని పోయారంటూ సదరు యువతి పోలీసులకు చెప్పింది. దీనితో పోలీసులు యువతి చెప్పిన కారు వివరాలును తీసుకుని వేట మొదలు పెట్టారు. ఆ ప్రాంతలో ఉన్న సీసీ పుటేజ్ ను క్షణ్ణంగా పరిశీలించారు. అయితే అనుమానాస్పదంగా ఎటువంటి వాహనాలు పోలీసులకు చిక్కలేదు. దీనితో పాటుగా కారు వివరాలు చెప్పడంలో యువతి ఒక్కోసారి ఒక్కో విధంగా చెప్పడం యువతి తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు మరింత లోతుగా విచారిస్తే అసలు విషయం బయటకు వచ్చింది.

నోయిడా విశ్వవిద్యాలయంలో చదువుతున్న సదరు యువతి పరీక్షలకు ఆలస్యంగా వచ్చింది. దీనితో పరీక్షలు రాయడానికి అధికారులు అనుమతించలేదు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్తే ఇబ్బందులు పడనని అనుకున్న యువతి గ్యాంగ్ రేప్ నాటకానికి తెరతీసింది. గుర్తు తెలియని వ్యక్తులు తనను కిడ్నాప్ చేశారంటూ ఇంట్లోని వారికి కట్టుకథలు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణలో అసలు విషయం బయటకి వచ్చింది. గ్యాంగ్ రేపు జరగలేదని తేల్చిన పోలీసులు యువతిని గట్టిగా మందలించి వదిలేశారు.