క్యాష్ ఫుల్ జనమే నిల్…

పెద్ద నోట్ల రద్దు తరవాత దేశవ్యాప్తంగా ప్రజలు ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు పడిగాపులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే జమ్ము కాశ్మీర్ లోని చాలా ప్రాంతాల్లో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. అక్కడ ఏటీఎంలలో కావాల్సినంత డబ్బున్న తీసుకునే వారే కరువయ్యారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు భిన్నంగా శ్రీనగర్ లో మాత్రం ఏటీఎం సెంటర్ లు, బ్యాంకులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పెద్ద నోట్లను రద్దు చేసిన వెంటనే కొంత రద్దీ కనిపించినప్పటికీ ఆ రద్దీ మూడు, నాలుగు రోజులకే తగ్గిపోయింది.

హుజ్ బుల్ ఉగ్రవాది బుర్హాన్ ఎన్ కౌంటర్ తరువాత శ్రీనగర్ లో తీవ్ర ఉధ్రిక్తత పరిస్థితులు ఏర్పడిన నేపధ్యంలో చాలా కాలంగా ఇక్కడ కర్వ్యూ నీడలోనే ఉండిపోయింది. దీనితో ప్రజలు బయటకు వచ్చిందే తక్కువ. దీనితో శ్రీనగర్, పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఉపాధి లేక అలమటిస్తున్నారని అటువంటి పరిస్థితల్లో బ్యాంకుల్లో డబ్బులు ఎక్కడి నుండి వస్తాయని స్థానికులు అంటున్నారు. పనికి వెళ్లక పోవడంతో ఎవరి దగ్గరా అసలు డబ్బులే లేవు ఇక మాకు ఏటీఎం లతో ఏం పని  అని వారు ప్రశ్నిస్తున్నారు.

ఒక పక్క చలికాలం మరో పక్క ఉధ్రిక్త పరిస్థితుల వల్ల స్థానికులు పెద్ద మొత్తంలో నిత్యావసర వస్తువులు నిల్వ చేసుకున్నారని దీని వల్ల కూడా స్థానికులకు డబ్బు అవసరం లేకుండా పోయిందని అంటున్నారు. మొత్తం మీద దేశవ్యాప్తంగా ఒకరకమైన వాతావరణం ఉంటే శ్రీనగర్ లో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.