కోట్లాది రూపాయలు పోగేసిన శేఖర్ రెడ్డి అరెస్ట్

పెద్ద మొత్తంలో నల్ల ధనాన్ని దాచుకున్న తమిళనాడుకు చెందిన వ్యాపార వేత్త, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. శేఖర్ రెడ్డి వద్ద లెక్కలు చూపని 139 కోట్ల రూపాయల నగదుతోపాటుగా 179 కిలోల బంగారం దొరికింది. శేఖర్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారం నిల్వలు లభించడంతో ఐటి అధికారులో విస్తుపోవాల్సి వచ్చింది. పెద్ద మొత్తంలో కొత్త నోట్లు లభించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. లెక్కల్లో చూపని నగదు నిల్వలు, బంగారం నిల్వలకు సంబంధించి శేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న సీబీఐ జనవరి 3వరకు తన కష్టడీలోకి తీసుకుంది.

శేఖర్ రెడ్డి వద్ద లభించిన బంగారం, నగదు నిల్వలకు సంబంధించి మొత్తం వివరాలు రాబట్టే పనిలో సీబీఐ అధికారులు పడ్డారు. శేఖర్ రెడ్డితో సంబంధం ఉందన్న ఆరోపణలపై తమిళనాడు ప్రధాన కార్యదర్శి నివాసాల్లో సైతం సోదాలు జరిగాయి. రాజకీయ, అధికారుల్లో ఎవరు శేఖర్ రెడ్డికి సహకరించారు ఎవరెవరితో ఆయనకు సంబంధాలు ఉన్నాయి అనే అంశంపై కూడా సీబీఐ విచారిస్తోంది. నల్లధనంతో దొరికిపోయిన శేఖర్ రెడ్డిని టీటీడీ బోర్డు సభ్యత్వం నుండి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలగించింది. శేఖర్ రెడ్డి అరెస్టుతో ఇంకా ఎంత మంది ప్రముఖుల పేర్లు బయటకి వస్తాయో చూడాలి.