కొత్తనోట్లకూ నకిలీ బెడద

కొత్తనోట్లు ఇంకా పూర్తిగా ప్రజల్లోకి రాకముందే నకిలీ నోట్లను తయారు చేస్తున ముఠాలు పుట్టుకొని వస్తున్నాయి. కొత్త నోట్లు ఇంకా పూర్తిగా ప్రజల్లోకి రాకపోవడంతో పాటుగా కొత్త నోటుపై ప్రజలకు పెద్దగా అవగాహన లేకపోవడం నకిలీ నోట్ల తయారీ ముఠాలకు వరంగా మారింది. నకిలీ నోట్లను చలామణిలోకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్న ఒక ముఠాను రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఎనిమిది మందితో కూడిన ముఠా నకిలీ కరెన్సీని చలామణిలోకి తీసుకునిరావడానికి ప్రయత్నించినట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు. ఎనిమిది మంది ముఠాలో ఆరుగురుని అరెస్టు చేశామని మరో ఇద్దరిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు. కొత్త రు.2000, రు.500 నోట్లకు నకిలీ నోట్లను తయారు చేసి ప్రజల్లోకి తీసుకుని వచ్చేందుకు వీరు ప్రయత్నించినట్టు ఆయన చెప్పారు. వీరి వద్ద నుండి 2 లక్షల 23 వేల నకిలీ కరెన్సీ ని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. నకిలీ నోట్లు అసలు నోట్లను పోలిఉన్నప్పటికీ సెక్యూరిటీ మార్క్ ను మాత్రం నకిలీ నోట్ల ముఠ కాపీ చేయలేకపోయిందని నోట్లను పరిశీలిస్తే అవి నకిలీ నోట్లుగా తెలిసిపోతోందని కమిషనర్ చెప్పారు. అసలు నోట్లు పూర్తిగా ప్రజల్లోకి రాకపోవడం వల్ల దాని అసరాగా చేసుకుని నకిలీ నోట్లను చెలామణి చేసేందుకు ఈ ముఠా ప్రయత్నించినట్టు కమిషనర్ వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నోట్లపై అవగాహన ఏర్పరుచోవాలని కోరారు.