కొంత మంది కోసమే నోట్ల రద్దు:రాహుల్

కొంతమంది కార్పోరేట్ మిత్రులకు లాభం చేకూర్చడం కోసమే ప్రధాని నరేంద్ర మోడి పెద్ద నోట్ల రద్దు చేశారని విపక్షాలు ఆరోపించాయి. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద విపక్షాలు ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ మాట్లాడుతూ పెద్ద నోట్లను రద్దు చేయడంతో దేశంలోని ప్రజలంతా బ్యాంకుల ముందు పడిగాపులు పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు రోడ్ల మీద అల్లాడుతుంటే దీన్ని అడ్డం పెట్టుకుని కొంత మంది బడా పారిశ్రామిక వేత్తలు కోట్లాది రూపాయలు పోగుచేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. పేటీయం లాంటి సంస్థలకు లాభం చేకూర్చడం కోసమే ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి నగదు రహిత లావాదేవీలంటూ కొత్త నాటకాలు ఆడుతోందని దుయ్యబట్టారు. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తి లాగా ప్రజలు నానా అగచాట్లు పడుతున్నా ఇవేవి ప్రధానికి పట్టనట్టే ఉన్నయాని అన్నారు. నల్ల ధనాన్ని వెలికితీసేందుకు పెద్ద నోట్లను రద్దు చేశమని తొలుత ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నగదు రహిత లావాదేవీలు అంటూ కొత్త పల్లవి అందుకుందని తద్వారా తనకు అనుకూలంగా ఉన్న వారికి వేలాది కోట్ల రూపాయల మేర లాభం చేకుర్చుతోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు.