కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు: తలసాని

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు నిజం చెప్పే అలవాటు లేదని ఆయన జీవితంలో ఒక్కసారి కూడా నిజం చెప్పి ఎరుగడని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మరోసారి చంద్రబాబు పై తీవ్రస్థాయిలో విరుచుకుని పడ్డారు. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోవడం ఖాయమని ఎన్నికల సంఘం పనితీరు, ఈవీఎంల పనితీరుపై ఆయన మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనమని తలసాని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అంతటి అవినీతి ముఖ్యమంత్రి దేశం మొత్తంలో ఎవరూ లేరని తలసాని పేర్కొన్నారు. ఏపీ ఎన్నికల్లో కేసీఆర్ ను తిట్టడం మినహా చంద్రబాబు చేసింది ఏమీ లేదని అందుకే అక్కడి ప్రజలు ఆయన్ను తిరస్కరించారన్నారు. గత ఐదు సంవత్సరాల్లో తాను ఏంచేసిందీ చెప్పకుండా చంద్రబాబు నాయుడు కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని కేసీఆర్ ను తిట్టడం ద్వారా ఏపీలో ప్రజల సానుభూతిని పొందడానికి చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలం అయ్యాయని తలసాని పేర్కొన్నారు.
తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ సంపూర్ణ విజయం సాధిస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 17 లోక్ సభ స్థానాలకు గాను 16 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. తమకు కనీసం పోటీని ఇచ్చే స్థాయిలో తెలంగాణలో విపక్షాలు లేవని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తలసాని చెప్పారు.