కుంటుపడుతున్న వ్యవసాయం…

ఒక పక్క వర్షాభావ పరిస్థితులు, మరో పక్క పెద్ద నోట్ల రద్దు ఈ రెండు అంశాల తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఖరీఫ్ లో దిగుబడి గణనీయంగా  తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాలు ముఖం చాటేయడంతో వర్షాధార పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.  సెప్టెంబర్ లో కురిసిన వర్షాల వల్ల జలశయాలు పూర్తిగా నిండినా వర్షాలపై ఆధారపడిన రైతుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. వర్షాలు లేక పంటలు వేసే పరిస్థితి కనిపించడం లేదు. సాధారణం కన్నా 98 శాతం తక్కువగా వర్షాలు పడ్డాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. తుపాను కారణంగా వర్షాలు కురుస్తాయని ఆశించిన రైతులకు ఆశాభంగం తప్పలేదు. తుపాను వల్ల ఒకటి రెండు జిల్లాలు మినహా ఎక్కడా పెద్దగా వర్షాలు పడలేదు. దీని వల్ల రైతులక ఎటువంటి ప్రయోజనం కలగలేదు.

ఒక వైపు వర్షాభావం ఉంటే మరోవైపు పెద్ద నోట్ల రద్దు కూడా రైతుల పాలిట శాపంగా మారింది. పెద్ద నోట్ల రద్దుతో రైతులు వ్యవసాయ పనులు చేసుకునే స్థితిలో లేరు. జలశాయాల్లో పుష్కలంగా నీరు ఉండడంతో సాగునీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో వర్షాలు లేకపోయినా రైతులకు పెద్దగా ఇబ్బందులు లేవు. అటు విద్యుత్ సరఫరా కూడా తగినంత ఉండడంతో వాస్తవానికి నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయపు పనులు జోరుగా సాగాల్సి ఉంది. కానీ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. వ్యవసాయపు పనులు అటకెక్కాయి గ్రామాల్లో నోట్ల రద్దు తో రైతుల చేతిలో వ్యవసాయపు పనులకు డబ్బులు లేక పనులను ఆపేస్తున్నారు. కూలీలకు ఇవ్వడానికి డబ్బులు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే కూలీలు లేక వ్యవసాయ కూలీలు పస్తులుండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

ఒక వైపు వర్షాభావం, మరో వైపు పెద్ద నోట్ల రద్దు వెరసి వ్యవసాయం మాత్రం కుటుపడింది. దీని ప్రభావం ఆహార ధాన్యాల ఉత్పత్తి మీద గణనీయంగా పడుతుందని భావిస్తున్నారు.