చంద్రబాబుకు ఊరట

ఓటుకు నోటు కేసులో హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేయాలంటూ ఏసీబీ కోర్టు జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. దీనితో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఊరట కలిగినట్లయింది. తన పాత్రపై దర్యాప్తు చేయాలంటూ ఏసీబీ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబునాయుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు గతంలో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు పై విచారణ అవసరం లేదన్న ఆయన న్యాయవాది వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ టి.సునీల్‌చౌదరి గత నెలలో విచారణ జరిపారు. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ, ఓటు  వేసేందుకు లంచం తీసుకుంటే అది అవినీతి కిందకు రాదని వాదనలు వినిపించారు. తాజా తీర్పుతో చంద్రబాబు కు ఊరట లభించినట్టే భావించవచ్చు.