ఐసిస్ సానుభూతిపరులకు పోలీసుల కౌన్సిలింగ్

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ లో హైదరాబాద్ మూలాలు అప్పుడప్పుడూ బయట పడుతూనే ఉన్నాయి. అతివాద భావజాలంతో యువకును ఆకర్షిస్తున్న ఐసిస్ అమాయక యువకులను తన వలలో వేసుకుంటోంది. ఐసిస్ లో చేరేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులను తాజాగా టర్కీ పోలీసులు అదుపులోకి తీసుకుని నగరానికి పంపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు ఐసిస్ లో చేరేందుకు ప్రయత్నించి టర్కీ పోలీసులకు పట్టబడ్డారు. వారిని హైదరాబాద్ కు తిప్పి పంపారు.

పట్టుబడిన ఇద్దరూ ఉన్నత విద్యావంతులు కావడం విశేషం. వీరిద్దరూ ఇంనీరింగ్ పూర్తి చేశారు. ఒకరు సౌదీ ఆరేబియాలో ఉద్యోగం చేస్తుండగా మరొకరు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. ఇంటర్ నెట్ లో పరిచయం అయిన ఈ ఇద్దరూ ఐసిస్ భావజాలానికి ఆకర్షితులై ఐసిస్ లో చేరి యుద్ధం  చేయాలనుకున్నారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న యువకుడు సౌదీకి చేరుకున్నాడు ఇద్దరీ అక్కడి నుండి టర్కీ మీదగా సిరియాకు చేరుకుని ఐసిస్ లో చేరేలనే ప్లాన్ వేసుకున్నారు.. టర్కీ సరిహద్దుల గుండా సిరియా చేరుకోవాలనుకున్న వీరిని టర్కీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరనీ అక్కడి నుండి హైదరాబాద్ కు పంపారు. ఇక్కడి పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లి దండ్రులకు అప్పగించారు. వీరిద్దరేనా మరెవరైనా వీరిని సంప్రదించారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.