ఐటి దాడుల్లో 2900 కోట్లు లభ్యం

పెద్ద నోట్లను రద్దు చేసినప్పటినుండి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన దాడుల్లో 2900 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు ఆ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. మొత్తం 586 చోట్ల ఈ దాడులను నిర్వహించినట్టు ఐటి శాఖ తెలిపింది.  తమ దాడుల్లో బయటపడిన ధనంలో 79 కోట్ల రూపాయల విలువగల రెండు వేల రూపాయల నోట్లు బయటపడినట్టు ఐటి అధికారులు వెల్లడించారు. 2600 కోట్ల రూపాయల నగదుకు లెక్కలు లేవని వారు చెప్పారు. దేశం మొత్తం మీద తమిళనాడులో ఎక్కువ మొత్తంలో లెక్కలు చూపని నగదు లభ్యం అయిందని ఐటి అధికారులు చెప్పారు.

పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తరువాత నల్ల ధనంపై కొరడా జుళిపిస్తున్న ఐటి శాఖ అనుమానం ఉన్న ప్రతీ తోటా సోదాలు నిర్వహిస్తోంది. పెద్ద నోట్ల ను మార్చుకునే ప్రయత్నంలో అనేక మంది బడా బాబులు  ఐటి అధికారులకు చిక్కారు. నల్ల ధనాన్ని మార్చుకునే ప్రయత్నంలో కొందరు, నల్ల ధనాన్ని తిరిగి లెక్కల్లో చూపే విధంగా ప్రయత్నించి మరికొందరు ఐటి అధికారుల వలలో పడ్డారు. దేశవ్యాప్తంగా దాడులను ముమ్మరం చేస్తామని ఐటి శాఖ పేర్కొంది.