ఇరుక్కుపోయిన పాకిస్థానీ

సమాచార లోపం ఆ పాకిస్థాన్ జాతీయుడిని పోలీసులకు పట్టిచ్చింది. ఐదువందల రూపాయల నోట్లను రద్దచేసిన సంగతి తెలియని ఒక పాకిస్థానీ నకిలీ ఐదు వందల రూపాయల నోట్లతో తిరుగుతూ పోలీసులకు పట్టుపడ్డాడు. పాకిస్థాన్ నుండి టూరిస్టు విసాపై భారత్ కు వచ్చిన బుర్హానుద్దీన్ సజ్జాద్ తనతో పాటుగా 50వేల రూపాయల నకిలీ ఐదు వందల రూపాయల నోట్లు తీసుకుని వచ్చాడు. భారత్ లో నకిలీ నోట్లను చలామణి చేద్దామనుకుని ఇక్కడికి చేరుకున్న సజ్జాద్ కు ఐదు వందల రూపాయల నోట్ల రద్దుకు సంబంధించి సమాచారం లేదట. అసలు నోట్లనే ఎవరూ తీసుకోని పరిస్థితుల్లో తన వద్ద ఉన్న నకిలీ నోట్లను చాలామణి చేయడానికి నానా పాట్లు పడ్డ సజ్జాద్ నుపోలీసులు అరెస్టు చేశారు.

ఇతని వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సూరత్ పట్టణంలో పోలీసులు ఇతన్ని అరెస్టు చేశారు. అరెస్టయిన పాకిస్థాన్ జాతీయుడి వద్ద 50వేల రూపాయల విలువైన పాత ఐదు వందల రూపాయల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసినపుడు తాను ముంబాయికి చెందిన వాడినని చెప్పుకున్న సజ్జాద్ ను విచారిస్తే అసలు వాస్తవాలు బయటికి వచ్చాయి. అతను పాకిస్థాన్ నుండి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. పాకిస్థానీ పాస్ పోర్టును కూడా అధికారుల స్వాధీనం చేసుకున్నారు. ఇతను పాకిస్థాన్ నుండి భారత్ కు ఎందుకు వచ్చాడు అనేదానిపై పోలీసులు విచారిస్తున్నాడు. నోట్ల రద్దు గురించి తనకు తెలియదని అందుకే పాత నోట్లను మార్చడానికి ప్రయత్నించినట్టు సజ్జాద్ విచారణలో చెప్పాడు. నకిలీ నోట్లను తనకు అంటగట్టారని అవి కూడా రద్దయిన పాత నోట్లు కావడంతో తాను పోలీసులకు చిక్కానని లోబోదిబో మంటున్నారు.