ఈ రాక్షసులకు పశ్చాత్తాపమే లేదు

ఉరి శిక్ష పడ్డ దిల్ షుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో దోషుల ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. న్యాయమూర్తి తీర్పును వెలువరించడానికి ముందు కూడా వీరిని తమ వాదనలు చెప్పాల్సిందిగా కోరినా కూడా తమకు న్యాయవిచారణ జరుగుతున్న తీరు పై నమ్మకం లేదని చెప్పారు తప్ప ఎక్కడా చేసిన నేరం పట్ల పశ్చాతాపం కనిపించలేదని సమాచారం. న్యాయమూర్తి తీర్పు చెప్పిన తరువాత కూడా ఈ రాక్షసులు నవ్వుతూ కనిపించారని చెప్తున్నారు. 18 మంది అమాయకుల ప్రాణాలను హరించడంతో పాటుగా 130 మందికి పైగా తీవ్రంగా గాయ పడ్డ ఘటనకు సూత్రధారులు, పాత్రధారులు అయిన ఈ ఉగ్రవాదుల్లో చేసిన పాపం పట్ల కొంత మేరకైనా అపరాధ భావం కనిపించలేదని అంటున్నారు.

ఉరి శిక్ష పడ్డా ఏ మాత్రం చలించకుండా ఉన్న ఇటువంటి రాక్షసులను వీలైనంత త్వరగా ఉరితీయాలని ప్రజలు కోరుతున్నారు. ఉరి శిక్ష పై హైకోర్టులో అప్పీలుకు వెళ్లనున్నట్టు దోషుల తరపున లాయర్ చెప్పాడు. హైకోర్టులో కూడా కేసును త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.