ఈయన ఇట్లా…ఆయన అట్లా- ఎందకు మారారు

పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మఖ్యమంత్రులు ఇద్దరూ స్పందిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే ఆంధ్రప్రదేశ్ సీఎం ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. పెద్ద నోట్ల రద్దతో దేశంలో నల్లధనం కనుమరుగు అవుతుందని పెద్ద నోట్లను రద్ద చేయాలనే డిమాండ్ ను తమ పార్టీ ఎప్పటి నుండో వినిపిస్తోందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దతో అన్నీ శుభపరిణామాలే అన్న చంద్రబాబు కొన్ని రోజులు తిప్పలు తప్పవని ప్రజలు వాటిని భరించాలని అన్నారు.
ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద నోట్ల రద్దును పూర్తిగా కాకున్నా కొంతమేరకు వ్యతిరేకించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల సమస్యలు వస్తాయని ప్రజలు ఇబ్బందులు పడతారని అన్నారు. నోట్ల రద్దుతో ఆర్థిక సంక్షోభాలు తలెత్తుతాయన్నారు. రాష్ట్రాల ఆదాయం తగ్గిపోతుందని ఈ లోటును కేంద్ర ప్రభుత్వమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇద్దరు చంద్రుల్లో ఒకరు స్వాగతిస్తే మరొకరు వ్యతిరేకించారు. కాల క్రమంగా పరిస్థితులతో పాటుగా ఇద్దరు ముఖ్యమంత్రుల మాటల్లోనూ మార్పులు వచ్చాయి. నోట్ల రద్దును చంద్రబాబు క్రమంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. నోట్ల రద్దు నిర్ణయం మంచిదే అయినా దాన్ని అమలు చేస్తున్న తీరులో లోపాలున్నాయని మండిపడ్డారు. బ్యాంకర్ల సమావేశంలోనూ చంద్రబాబు వారిపై విరుచుకుని పడ్డారు. బ్యాంకర్లు సరిగా వ్యవహరించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శిస్తున్నారు. పెద్ద నోట్ల రద్ద తరువాత అంతంత మాత్రంగానే ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత దారణంగా తయారైందని చంద్రబాబు అంటున్నారు.
ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద నోట్ల రద్దను పూర్తిగా సమర్థిస్తున్నారు. నోట్ల రద్దు, నగదు రహిత సమాజం వల్ల మంచి జరుగుతుందని ప్రజలకు మేలు జరుగుతుందని అంటున్నారు. కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన తీరు బీజేపీ మిత్రపక్షం ముఖ్యమంత్రిలాగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రజలకు అంతిమంగా మేలు జరిగితే మంచిదని అటువంటి నిర్ణయానికి తమ ప్రభుత్వం మద్దతు ప్రకటిస్తుందని అన్నారు. మోడీ నిర్ణయానికి పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరుపున అన్నిరకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇద్దరు సీఎంల వ్యవహార శైలిలో మార్పుకు కారణం ఏమిటా అన్నది ఇతమిద్ధంగా తిలియనప్పటికీ ఇద్దరూ నోట్ల రద్దు వెంటనే చేసిన ప్రకటనలకు తరువాత మాట్లాడుతున్న తీరుకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కన్నా ఆంధ్రప్రదశ్ పైనే పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. తెలంగాణలో సమస్యలు ఉన్నప్పటికీ తెలంగాణాలో కన్నా ఏపీలో సమస్యలు అధికంగా ఉన్నాయని చెప్తున్నారు. నగదు రహిత లావాదేవీలు తెలంగాణలో ఎక్కువగా జరుగుతుండగా ఏపీలో చాలా తక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే పెద్ద నోట్ల రద్దుపై సీఎంల మాటల్లో మార్పు వచ్చిందా అనేదానితో పాటుగా రాజకీయ పరమైన కారణాలు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *