ఇంట గెల్చాం… ఇక రచ్చే మిగిలింది

ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో అద్భుతమైన విజయం సొంతం చేసుకోవడం ద్వారా భారత క్రికెట్ జట్టు 2016కు ఘనంగానే వీడ్కోలు పలికింది. గొప్ప గొప్ప పేరున్న స్టార్ ఆటగాళ్లు ఈ జట్టులో ఎక్కువ మంది లేకున్నా కలసికట్టుగా రాణించడం ద్వారా భారత్ ఇంగ్లాండ్ ను మట్టికరింపింది. ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ను 4-0తో గెల్చుకోవడం ద్వారా భారత్ ఈ సిరీస్ లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఒక్క తొలి మ్యాచ్ లో తప్ప భారత్ ఎక్కడా తడబడకుండా ఆడి సత్తా చాటింది. డ్రా అవుతుందనుకున్న ఆఖరి మ్యాచ్ లో అనూహ్యాంగా విజయ తీరాలకు చేర్చడం ద్వారా భారత్ అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించింది. విరాట్ కోహ్లీ సారధ్యంలో ని భారత జట్టు లోని కొత్త ఆటగాళ్లు సత్తా చాటుకున్నారు. నాయర్, రాహుల్, జయంత్ లు ఆకట్టుకుంటే అశ్విన్, జడేజా లు అదరగొట్టారు.

స్వదేశంలో తిరుగులేని రికార్డున్న భారత జట్టు విదేశాల్లో మాత్రం చతికిల బడుతోంది. విదేశాల్లోని ఫాస్ట్ పిచ్ లపై మన ఆటగాళ్లు తేలిపోతున్నారు, బౌలర్లు విఫలం అవుతుండగా బ్యాట్స్ మెన్ పెవీలియన్ దారి చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని ఇకపై విదేశీ పిచ్ లపైనా దూసుకుని పోతామని టీం ఇండియా భరోసా ఇస్తోంది. స్వదేశంలో సత్తా చాటాం ఇక విదేశాల్లోనూ మా ప్రతాపాన్ని చూపుతాం అంటున్నారు మన ఆటగాళ్లు. స్పూర్తిగాయకమైన ఆటతీరుతో ఆకట్టుకున్న మన జట్టు విదేశాల్లో కూడా ఇలాగే రాణించాలని కోరుకుందాం.