ఇంకా వీడని కరెన్సీ కష్టాలు

పెద్ద నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తరువాత నుండి తలెత్తిన సమస్యలు ఇంకా తీరడం లేదు. చిల్లర కోసం నోట్ల కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రు.1000,రు.500 నోట్లను రద్దు చేసిన తరువాత ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఉన్న 86శాతం నోట్లు రద్దయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా కరెన్సీ కొరత ఏర్పడింది. బ్యాంకుల నుండి డబ్బులను విత్ డ్రా చేసుకోలేక నానా యానతలు పడుతున్నారు. దీనికి తోడు ఏటీఎంలు  ఇప్పటికీ పనిచేయకపోవడం కరెన్సీ సమస్యని మరింత పెంచింది. దేశవ్యాప్తంగా క్యాష్ లెస్ దిశగా అడుగులు వేయాలని ప్రభుత్వం సూచించినప్పటికీ ఆచరణ దిశగా అది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. దీనితో ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం.  డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహంలో భాగంగా దుకాణాల యజమానులు డెబిట్ కార్డుల వినియోగాన్ని ప్రోత్సహించాలని, దీనివల్ల నగదు నిర్వహణ ఖర్చులు ఉండవని ఆర్థిక శాఖ పేర్కొంటోంది.  తక్కువని, నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉండదని పేర్కొంది. అలాగే వ్యాపారుల క్రెడిట్ వివరాలు నమోదవుతాయని, బ్యాంకుల నుంచి మరింత సాయం అందుకునేందుకు అది ఉపయోగపడుతుందని వెల్లడించింది. డెబిట్ కార్డుల్ని ప్రోత్సహించే వ్యాపారులకు ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక ప్రోత్సాహకాలు అందుతాయని తెలిపింది. డెబిట్ కార్డుల వినియోగం వల్ల వ్యాపారుల ఆదాయం పెరగడంతో పాటు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందుతాయని పేర్కొంది. దేశంలో బ్యాంకుల వద్ద భారీ క్యూలకు ముగింపు పలకాలంటే కనీసం రూ. 10 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉండాలని, రూ. 500 కొత్త నోట్లు అత్యవసరమని ఎస్‌బీఐ పేర్కొంది. నగదు కొరతపై అధ్యయనం చేశామని, రూ. 10 లక్షల కోట్లు చలామణిలోకి వస్తే క్యూలు అదృశ్యమవుతాయని ఎస్ బీ ఐ వెల్లడించింది.