ఆరు కోట్ల కొత్తనోట్లు స్వాధీనం

రెండు వేలు బ్యాంకు నుండి తీసుకోవడానికి రెండు రోజుల పాటు కష్టపడాల్సి వస్తున్న ప్రస్తుత పరిస్తితుల్లో ఇద్దరు వ్యక్తుల నుండి ఏకంగా ఆరు కోట్ల రూపాయల నోట్లను ఐటి శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తంలో ఐదు కోట్ల రూపాయలు రెండు వేల రూపాయల కొత్త నోట్లు ఉండడంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు విస్తుపోతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఇంత తొందరగా లెక్కల్లో చూపని నోట్లు ఏ విధంగా వీరి వద్దకు చేరింది అనే దానిపై ఐటి శాఖ దర్యాప్తు చేస్తోంది.  ఆ ఇద్దరు వ్యక్తులు సీనియర్ అధికారులని తెలుస్తోంది. ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేసినప్పటి నుంచి ఇంత ఎక్కువ మొత్తంలో డబ్బు దొరకడం ఇదే మొదటిసారి. ఇందులో బ్యాంకు అధికారుల హస్తం కూడా ఉందని అనుమానిస్తున్నారు. అసలు ఇన్ని పెద్దనోట్లు, కొత్తవి వాళ్ల వద్దకు ఎలా వచ్చాయన్న విషయమై దర్యాప్తు చేస్తున్నామని ఆదాయపన్ను శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మొత్తం రికవరీ చేసుకున్న డబ్బు ఎంతో లెక్కపెట్టడానికి నోట్ల లెక్కింపు యంత్రాలు వాడాల్సి వచ్చింది. వాటితోపాటు.. ఐదు కిలోల బంగారం, ఆరు కిలోల నగలు, లాంబోర్గిని కూడా అక్కడ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు డబ్బులకు అల్లాడుతున్న క్రమంలో ఇంత పెద్ద మొత్తంలో వీరి వద్దకు కొత్త నోట్లు చేరిపోయాయి. మరి ఎంత మంది దగ్గర ఇట్లా పెద్ద నోట్లు చేరాయో మరి.