ఆమె మాటే శాసనం

జయలలిత మాటే ఒక శాసనం..పార్టీలో ప్రభుత్వంలో ఎంతటి వారైనా అమె మాట వినాల్సిందే ఆమె ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాల్సిందే. ఆమెను మాటను జవదాటే నాయకుడు అన్నాడీఎంకే పార్టీ లోనూ ఇటు ప్రభుత్వ వర్గాల్లోనూ ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు.  అనుగ్రహిస్తే ఎవరినయినా అందలమెక్కిస్తుంది. ఆగ్రహిస్తే వెంటాడుతుంది. ఇదే జయలలిత నైజం. జయలలితను అడదొక్కాలని ప్రత్యర్థులు ప్రయత్నించిన ప్రతీసారీ అమె రెట్టించిన ఉత్సాహంతో ముందుకు ఉరికారు. వ్యక్తి పూజ ఎక్కువగా ఉండే తమిళనాడులో అమ్మను ఆరాధ్యదైవంగా కొలిచే వారికి కొదవే లేదు.  రాజకీయవైరం వుంటే ఎంతవరకైనా వేళతారని అంటారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌ కన్నుమూసిన అనంతరం ఆమె పార్టీలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఎంజీఆర్‌ సతీమణి జానకీ రామచంద్రన్‌ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టినా నిలదొక్కుకోలేకపోయారు. అనంతరం పార్టీ జానకి, జయ వర్గాలుగా చీలిపోయింది. అనంతరం వచ్చిన 1989 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీచేశాయి. దీంతో డీఎంకే అధికారాన్ని కైవసం చేసుకుంది. జానకి రామచంద్రన్‌ రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ఆమె వర్గం తిరిగి జయలలిత సారథ్యంలోని అన్నాడీఎంకేలో విలీనమయింది.పార్టీలో ఎవరైనా ఆమె అభిప్రాయాలను అంగీకరించాల్సిందే. ఎవరూ ఎదురు చెప్పేవారు కాదు. మంత్రిమండలిలో మార్పులు, చేర్పులు ఆమె ఇష్టప్రకారమే జరిగేవి. అమె ఆశీస్సులు ఉంటేనే మంత్రి పదవి దక్కుతుంది లేదంటే లేదు. పార్టీ లో రెండవ పవర్ సెంటర్ అంటూ ఏదీ లేకుండా చేసుకున్న ఘనత జయలలితదే. తన నచ్చితే నెత్తిన పెట్టుకునే జయలలిత నెచ్చెసి శశికళ విషయంలో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా వేటిని లెక్కచేయని జయలలిత ఒక సమయంలో తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారంటూ శశికళతో సహా అమె కుటుంబ సభ్యులను తన నివాసం నుండి బయటకు పంపారు. ఆ తరువాత తనకు జయే ముఖ్యమని కుటుంబసభ్యుల నుండి విడిపోయినట్టు ప్రకటించి తిరిగి జయలలిత దగ్గరికి చేరారు.