అమెరికా H1B వీసా ల పరిస్థితి ఏంటి

అమెరికాలో కరోనా కల్లోలం…. 90,000 మంది హెచ్1బీ వీసాదారుల పరిస్థితి అగమ్యగోచరం!

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ఆర్థికవ్యవస్థలను కూలదోస్తోంది. అగ్రరాజ్యం అమెరికా సైతం ఈ ప్రాణాంతక వైరస్ ధాటికి కుదేలైంది. అంతేకాదు, అమెరికాలోని హెచ్1బీ వీసాదారులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అమెరికాలోని టెక్ సంస్థలకు కరోనా తీవ్ర విఘాతం కలిగించడంతో దాదాపు 90,000 మంది హెచ్1బీ వీసాదారుల భవిష్యత్తుపై అంధకారం నెలకొంది. వీరికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీలు చేతులెత్తేయడంతో ఇప్పుడు వీరంతా తమ దేశాలకు వెళ్లిపోక తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే చాలామంది జీతాల్లేకుండానే పనిచేస్తున్నారు. అమెరికాలో సాధారణ పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయో తెలియని అనిశ్చితి ఏర్పడగా, హెచ్1బీ వీసాదారులను కొనసాగించడం టెక్ కంపెనీలకు మోయలేనంత భారంగా మారింది. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 3 లక్షల మంది వరకు హెచ్1బీ వీసాదారులు ఉన్నట్టు అంచనా. వారిలో కొందరు అమెరికాలో గత 15 ఏళ్లుగా పనిచేస్తూ, శాశ్వత పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నారు.

అమెరికాలో ఇంతవరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ ప్రకటించకపోయినా, అక్కడి ఆర్థికవ్యవస్థ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో హెచ్1బీ వీసాదారుల పరిస్థితి దయనీయంగా మారింది. వీరిని ఆయా కంపెనీలు ఉద్యోగం నుంచి తొలగిస్తే ఉద్యోగం లేకుండా అమెరికాలో ఉండడం చాలా కష్టం. దాంతో వీరందరూ అమెరికా నుంచి తమ దేశాలకు తిరిగి రావాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *