అభ్యర్థుల్ని మార్చబోం-కేసీఆర్ భరోసా

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తరపున రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన నాటి నుండే పార్టీలో అసమ్మతి రేగింది. టికెట్లు ఆశించిన వారిలో వారు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ప్రకటించిన అభ్యర్థిని స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. దీనితో పార్టీలో వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి. అసమ్మతి నేతల నుండి ఒత్తిడి పెరగడంతో పార్టీ ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులను మారుస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
అయితే పార్టీ అధినేత మాత్రం అభ్యర్థుల ప్రకటన జరిగిపోయిందని వారిని మార్చే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరి నుండి ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ అభ్యర్థుల జాబితాలో మార్పులు ఉండబోవని ఆయన భరోసా ఇస్తున్నట్టు సమాచారం. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు గాను 105 స్థానాల్లో పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించారు. వీటిలో కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చాలనే డిమాండ్ గట్టిగానే వినిపిస్తున్నా కేసీఆర్ మాత్రం అటువంటి అవసరం లేదని ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులందరికీ పార్టీ తరపున బీ-ఫాం దక్కుతుందని చెప్పినట్టు తెలుస్తోంది.
అభ్యర్థులు ఇప్పటినుండే ప్రచారం మొదలు పెట్టాలని కేసీఆర్ సూచించారు. ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని హైదరాబాద్ లో మకాం వేసి నాయకుల చుట్టు తిరగవద్దని నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకం అవ్వాలని కేసీఆర్ సూచించారు. అభ్యర్థులు విస్తృతంగా పర్యటించాలని నీయోజకవర్గంలోని ప్రతీ గడపను తొక్కాలని ఆదేశించారు.