అప్పుడే తీపి కబురు-అంతలోనే చేదు వార్త

సెప్టెంబర్ 22వ తేదీ నుండి చెన్నై లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై అన్నాడిఎంకే వర్గాలు ప్రకటన చేసిన కొద్ది సేపటికే ఆమెకు తీవ్రమైన గుండె నొప్పి వచ్చినట్టు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. అమ్మ ఆరోగ్యం మెరుగైందని ఆమెను సాధారణ వార్డుకు మార్చారని కొద్ది రోజుల్లోనే తమ నాయకురాలు తిరిగి ఇంటికి చేరుకుంటుందని అన్నా డిఎంకే వర్గాలు ప్రకటించాయి. ఈ ప్రకటతో ఊరట చెందిన అమ్మ అభిమానులు అమె త్వరలోనే ఇంటికి చేరుకుంటారని ఆనందం వ్యక్తం చేసుకున్న కొద్ది సేపటికే వారికి అమ్మ ఆరోగ్యం మరితం క్షీణించిందనే చేదు వార్త అందింది. జయలలితకు గుండె నొప్పి వచ్చిందని కార్డియాక్ అరెస్ట్ తో ఆమెను తిరిగి అత్యవసర విభాగానికి తరలించినట్టుగా అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీనితో అప్పటివరకు ఆనందంతో ఉన్న పురచ్చితలైవి అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ వార్త దావానంలా వ్యాపించడంతో అమ్మ అభిమానులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. దీనితో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. అటు తమిళనాడు గవర్నర్ గా అదనపు బాద్యతలు వహిస్తున్న మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు హుటాహుటిన చెన్నై చేరుకున్నారు. ఆయనతో పాటుగా ప్రభుత్వ , పోలీసు అధికారులు, అన్నా డీఎంకే ప్రముఖులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. దీనితో ఆస్సత్రి బయట తీవ్ర ఉద్వేగ వాతావరణం నెలకొంది. జయలలిత ఆరోగ్య స్థితిని గురించి అమ్మ అభిమానుల్లో ఆందోళన ఎక్కువైంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు అదనపు బలగాలను పంపింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారులతో మాట్లాడుతూ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.